పూర్వం సువర్ణముఖి నదీ తీరప్రాంతాన్నంతా శూరసేనుడనే రాజు పరిపాలించేవాడు. పేరుకి తగినట్లే అతను గొప్ప వీరుడు. అతని ధైర్య పరాక్రమాల గురించి తెలిసిన పొరుగు రాజులందరూ అతని పట్ల స్నేహభావంతో మెలిగేవారు. అతనితో ఎలాంటి గొడవలు రాకుండా చూసుకునేవారు.
శూరసేనుడికి అంత బలం ఉన్నా, ఆచరణలో మటుకు అతను చాలా సున్నితంగా ప్రవర్తించేవాడు. అతని పరిపాలన జన హృదయ రంజకంగా ఉండేది. "ప్రతి మనిషిలోనూ మంచి-చెడు రెండూ ఉంటాయి. పుట్టుకతోటే ఎవ్వరూ చెడ్డవాళ్ళు కారు. చెడు ప్రవర్తనకు పరిష్కారం శిక్ష మాత్రమే కాదు. వ్యక్తిలోని చెడుని నిర్మూలించాలి తప్ప అతనికి పైపై దండనలు విధించి ఉపయోగం లేదు. నేరస్తుడిలో దాగి ఉన్న మనిషిని వెలికి తేవటం అనే శక్తి కేవలం క్షమకు ఉన్నది. దానివల్లనే నేరం అంతరిస్తుంది" అని అతను ఎప్పుడూ చెబుతుండేవాడు.

దానికి అనుగుణంగానే అతను తన రాజ్యంలో నేరస్తులలో పరివర్తన తెచ్చేందుకు ప్రత్యేక సంస్థల్ని నెలకొల్పాడు. ఆ సంస్థలలో పనిచేసేవారంతా హృదయ పరివర్తనకు పెద్దపీట వేస్తూ, మహారాజుగారు తమకు అప్పగించిన నేరస్తులను సన్మార్గంలోకి తెచ్చేందుకు కృషి చేసేవారు.
శూరసేనుడి ఈ చర్యలు అతన్ని ప్రజలకు బాగా దగ్గర చేసాయి. అందరూ అతని దయార్ద్ర హృదయాన్ని అమితంగా ప్రశంసించేవారు.
అయితే శూరసేనుడు మాత్రం ఆ పొగడ్తలకి నిజమైన హక్కుదారు తన గురువు 'జ్ఞానేంద్రుడే' అని భావించేవాడు. తనకు యుద్ధ విద్యలు నేర్పటమే కాక, వాటి వెనక ఉన్న సూక్ష్మమైన అంశాలను అన్నిటినీ వివరించి చెప్పిన జ్ఞానేంద్రుడంటే ఆయనకు చాలా గౌరవం.
ఒకనాటి ఉదయం శూరసేనుడు సూర్య నమస్కారాలు చేస్తున్న వేళలో మహామంత్రి ఉదయుడు హడావిడిగా ఆయన దర్శనం కోరాడు. స్వతహాగా స్థిరబుద్ధి అయిన ఉదయుడి ముఖంలో కంగారుని చూసి "ఏమిటి మంత్రివర్యా, ఎందుకంత కంగారుగా ఉన్నారు? ఏదైనా ఉపద్రవం సంభవించిందా?" అని అడిగాడు శూరసేనుడు.

"మహారాజా! మన పొరుగురాజు అమరేంద్రుడు, మన మీదికి దండెత్తనున్నాడని చారులు తెలియజే-స్తున్నారు. నేటినుండి నాలుగవ రాత్రిన, అందరూ నిద్రిస్తున్న వేళ, రహస్యంగా మన రాజ్యాన్ని ఆక్రమింప జూస్తున్నారని మనకు స్పష్టమైన సమాచారం అందింది. అమరేంద్రుడి పరిపాలనలో అవంతీపుర ప్రజలంతా ఎన్ని కష్టాలపాలౌతున్నారో తమకు తెలియనిది కాదు. ఇప్పుడు తమరు అనుజ్ఞ ఇస్తే, అతని దౌర్జన్యానికి తగిన శిక్ష విధించినట్లూ అవుతుంది; ఇటు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చినట్లు, మన సామ్రాజ్యాన్ని విస్తరించినట్లూ ఉంటుంది- సైన్యసమేతంగా మేం రేపు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి, వారి రాజ్య పరిసరాల్లోనే వారిని అడ్డగిస్తాం!" అన్నాడు ఉదయుడు, ఉద్రేకంగా.
"అవంతీపుర రాజు అమరేంద్రుడు క్రూరుడు, దుష్టుడున్నూ. అతని దుస్సాహసానికి తగిన శాస్తి చేయటం సరైన పనే- అయినప్పటికీ అతను కూడా మనిషే కదా?! అతడ్ని అంతమొందించడం కాదు- అతనిలోని చెడుని అంతమొందించడమే ప్రధానం" అని ఆలోచనలో‌ పడ్డాడు శూరసింహుడు.
"మహారాజా! తమరి నిర్ణయం చెప్పండి. ఆ దుష్టుడ్ని అంతమొందించేందుకు ఆజ్ఞ ఇవ్వండి" అన్నాడు ఉదయుడు తొందరపడుతున్నట్లు.
శూరసింహుడు ఏదో మాట్లాడబోయేంతలో జ్ఞానేంద్రులవారు విచ్చేస్తున్నట్లు సమాచారం ఇచ్చాడొక భటుడు. రాజుగారు గబగబా వెళ్ళి గురువుగారిని ఆహ్వానించి, కూర్చుండబెట్టి మర్యాదలు చేసారు. "ఏమి నాయనా? కుశలమా? రాచకార్యాలన్నీ సజావుగా జరుగుతున్నాయా?" అడిగారు జ్ఞానేంద్రులవారు, శూరసింహుడి ముఖంలోని ఆందోళనను గమనించి. అమరేంద్రుడి పథకాన్ని, మంత్రిగారి సూచననీ వివరించి, తన ఆలోచననీ పంచుకున్నాడు శూరసేనుడు.
అంతా విని జ్ఞానేందులవారు చిరునవ్వు నవ్వి, "ఇందులో ఇక ఆలోచించటానికేమీ లేదు. మంత్రిగారి ప్రణాలికను అమలు చెయ్యాల్సిందే" అన్నారు.
"కానీ.. నేరము-శిక్ష-పరివర్తన.." అన్నాడు శూరసింహుడు.
జ్ఞానేంద్రులవారు నవ్వారు. "నాయనా! పెద్ద సమస్యే వచ్చినట్లుందే! సరే, నేను నది దగ్గరికి వెళ్లి, కేవలం పదే పది నిముషాల్లో స్నానం చేసి వస్తాను. ఆ వెంటనే నీ సందేహాన్ని తీర్చగలను. అందాక ఆగు" అని చెప్పి, స్నానానికి బయలుదేరారు.

పది నిముషాలు కాదుగదా, అర్థగంట గడిచినా ఆయన వెనక్కి తిరిగి రాలేదు. "ఏమైందో" అని రాజుగారే స్వయంగా నది దగ్గరికి వెళ్ళి చూసారు. జ్ఞానేందులవారు నీటిలో నిలబడి ఉన్నారు.

శూరసేనుడ్ని చూడగానే ఆయన నొచ్చుకుంటూ "అయ్యో, పాపం నువ్వే వచ్చావే! 'ఇదిగో- ఈ రాయిని నీళ్ళలో కూసింత నానబెట్టి, ఎట్లాగైనా మెత్తబరచి తెద్దాం' అని ఇందాకటినుండి ప్రయత్నిస్తున్నానయ్యా, అయినా ఫలితం ఉన్నట్లు లేదు. నువ్వేమైనా ప్రయత్నిస్తావా, మరి?" అన్నారు, ఒక నల్లటి రాయిని నదిలోంచి తీసి చూపుతూ.

"అయ్యో, అంత గట్టి రాయి, నీళ్ళలో కరగదుగా- మహా అయితే కొన్ని సంవత్సరాలపాటు నదిలో ఉండి నున్నగా అవ్వచ్చు అంతే" అనేసాడు శూరసింహుడు అసంకల్పితంగా.

"కానీ ఏంటో, మరి ఈ మట్టి బెడ్డలు మాత్రం ఎంచక్కా కరిగిపోయాయి నాయనా" అన్నారు జ్ఞానేంద్రులవారు రెండో చేతిని చూపుతూ.

"అవును - అర్థమైంది. ధన్యవాదాలు ఆచార్యా" అని జ్ఞానేంద్రునికి నమస్కరించిన శూరసేనుడు, మంత్రి వైపు తిరిగి "ఈరోజే అమరేంద్రునిపై యుద్ధం ప్రకటిస్తున్నాం. రేపే ప్రయాణం. అందరికీ తెలియజేయండి మంత్రివర్యా. దుండగుడికి తగిన రీతిలో బుద్ధి చెబుదాం" అన్నాడు.

ఆ వెంటనే శూరసేనుడి సైన్యం అవంతీపురంపై దండెత్తింది. అమరేంద్రుడిని సునాయాసంగా ఓడించి చెరసాలలో బంధించింది. అతని క్రూరపాలననుండి విముక్తులైన ప్రజలంతా ఉత్సాహంగా పండుగలు జరుపుకున్నారు."

బేతాళం ఈ కథ చెప్పి, "జ్ఞానేంద్రుడు కొత్తగా చెప్పినదేమున్నది? మట్టిబెడ్డ నీళ్ళలో కరుగుతుందనీ, బండరాయి కరగదనీ శూరసేనుడికి ముందే తెలియదా? లేకపోతే మట్టిబెడ్డల్లాంటి మామూలు నేరస్తులైతే కరిగి మంచివాళ్లవుతారనీ, బండరాయి లాంటి అమరేంద్రుడు అంత సులభంగా మారడనీ ఆయన చెప్పదలచాడా? అయినా అంతా చెప్పి శూరసేనుడు చేసినదేమిటి? అతని 'దయ, జాలి, హృదయ పరివర్తన' పాఠాలన్నీ ఎటు పోయాయి?" అన్నది.

మట్టిబెడ్డల్లాంటి మామూలు నేరస్తులు సులభంగా మారతారు; కానీ అమరేంద్రుడి లాంటి కరుడుగట్టిన క్రూరులు పరివర్తన చెందేందుకు చాలా సమయం పడుతుంది. రాజులుగా వాళ్ళు ఇతరుల్లోని మంచిని స్వీకరించే అవకాశమూ తక్కువే. అయినా వాళ్ళు మారేంతవరకూ ప్రజలు ఇబ్బందుల పాలవ్వటమూ ఏమంత మంచిది కాదు. అందువల్లనే శూరసేనుడు అతన్ని ఓడించి, పదవి నుండి తప్పించి, చెరసాలలో ఉంచి, మార్పు చెందేందుకు తగిన స్థితి కల్పించాడు. అతని తీరులో అసహజత్వం ఏదీ కనిపించట్లేదు.

ఇక పాలకుడన్నవాడు కరుణ, దయ, జాలి వంటి ఉన్నతమైన విలువలను పాటించటంతో బాటు తన శౌర్యానికి, గట్టితనానికి తగిన సంకేతాలు ఇస్తుండాలి. అలా చెయ్యకపోతే అది అతని అసమర్థతగా పరిగణింపబడుతుంది. జ్ఞానేంద్రుడు తన మట్టిబెడ్డ-బండరాయి ఉదాహరణ ద్వారా ఆ విషయాన్ని శూరసేనుడికి గుర్తుచేసాడని నాకు అనిపిస్తున్నది" అన్నాడు.

అలా విక్రంకు మౌనభంగం కలగటంతో బేతాళం అతని పట్టు నుండి చటుక్కున విడివడి, మళ్లీ చెట్టుకొమ్మ మీదికి చేరుకున్నది!